Site icon Prime9

Bathukamma: బతుకమ్మకు ఏఏ రోజు ఏఏ నైవేధ్యం పెడతారో తెలుసా..!

bathukamma food culture

bathukamma food culture

Bathukamma Festival food Culture: ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ అయిన బతుకమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై ఘనంగా బతుకమ్మలు పేర్చుతారు. ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ఏ రోజు ఏఏ నైవేధ్యం సమర్పిస్తారో ఓ సారి చూసేద్దామా..

1.ఎంగిలి పూల బతుకమ్మ
మహాలయ అమావాస్య రోజున అంటే.. భాద్రపదమాసం చివరి రోజు లేదా ఆశ్వయుజమాసం ముందురోజు బతుకమ్మ పండును జరుపుకోవడం ప్రారంభిస్తారు. కాగా ముందురోజే పువ్వులను తీసుకొచ్చి మరుసటి రోజు బతుకుమ్మని పేర్చడం వల్ల పూలు ఎంగిలైనట్టు భావించి ఆ రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని నానుడి.
అయితే ఆరోజు బతుకమ్మ ప్రసాదంగా నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేధ్యం తయారు చేస్తారు.
2.అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మ పేర్చుతారు. ఆరోజు గౌరమ్మ తల్లి నైవేధ్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో కూడిన ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
అటుకులను ఆ రోజు ఆడపడుచులకు వాయనంగా ఇస్తారు.
3.ముద్దపప్పు బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజున అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేధ్యం సమర్పిస్తారు.
4.నానే బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు చేసే బతుకమ్మని నానే బియ్యం బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారికి నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేధ్యం పెడతారు.
5.అట్ల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు పేర్చే బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజు అమ్మవారికి అట్లు లేదా దోశ నైవేధ్యంగా సమర్పిస్తారు.
6.అలిగిన బతుకమ్మ
పంచమి రోజు బతుకమ్మకి ఎలాంటి నైవేధ్యం సమర్పించరు.
7.వేపకాయల బతుకమ్మ
ఆశ్వయుజ షష్టి రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తారు.
8.వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ సప్తమి రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి ముద్దలుగా చేసి నైవేధ్యం తయారు చేస్తారు.
9.సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ అష్టమి రోజు సద్దుల బతుకమ్మను పేర్చుతారు. ఈ రోజున అమ్మవారికి ఐదు రకాల నైవేధ్యాలు తయారు చేస్తారు.
పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం మొదలైన వంటకాలతో అమ్మవారికి ప్రసాదం చేసి పెడతారు. ఆటపాటల అనంతరం బతుకమ్మలను నీటిలో విడిచిపెడతారు. ఆ తర్వాత ప్రసాదం బంధుమిత్రులకు పంచిపెట్టి తాంబూలం తీసుకుంటారు.

ఇదీ చదవండి: Bathukamma Immersion: బతుకమ్మను నిమజ్జనం ఎందుకు చేస్తారు.. దానివెనుకున్న రహస్యమేంటి..?

Exit mobile version
Skip to toolbar