Site icon Prime9

Crime News : సీన్ రివర్స్ … కేపీహెచ్బీ కాలనీలో యువకుడిపై దాడి చేసిన యువతి !

young-girl-attack-on-young-boy-in-kphb-colony

young-girl-attack-on-young-boy-in-kphb-colony

Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో యువకుల పైన కూడా యువతులు దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఏడాది లోనే తమిళనాడులో సహ జీవననానికి నో చెప్పాడని ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ యువకుడిపై యువతి మినీ కట్టర్ తో దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆంద్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీ సౌమ్య బీబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా కేపీహెచ్బీ లోని నాలుగవ లైన్ లో నివసిస్తుంది. సమీపం లోనే గుంటూరుకు చెందిన అశోక్ కుమార్ మరో ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడు. అదే రోడ్డు లోని ఓ టీ స్టాల్ వద్ద వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అలా 6 నెలలలో వీరిద్దరి మధ్య బాగా పరిచయం పెరిగింది. ఆ పరిచయంతో అశోక్ పెళ్లి చేసుకుంటానని సౌమ్యతో ప్రస్తావించాడు. కానీ ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ అశోక్ తో ప్రేమగా ఉంటుండేది. కాగా యువతి నివసిస్తున్న వసతి గృహంలో గొడవలు పెట్టుకోవడంతో నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించారు. దీంతో తొమ్మిదో ఫేజ్ లోని మరో హాస్టల్ కి మారింది. ఇక ఆమె ఖర్చులు కూడా అశోక్ భరిస్తూ వస్తున్నాడు.

ఇదే తరుణంలో అతను తరచూ పెళ్లి ప్రతిపాదనలు తెస్తున్నాడు. ఈ నెల 5 వ తేదీన అశోక్ పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ రాత్రి 7 గంటల ప్రాంతంలో టీ స్టాల్ వద్ద కలిశారు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో వారిద్దరి మధ్య మాటమాట పెరిగింది. అప్పటికే మినీ కట్టర్ తో వచ్చిన సౌమ్య… అశోక్ గొంతుపై దాడి చేసేందుకు ప్రయత్నించగా… అతను తప్పించుకోవడంతో మెడపై, చెంప కింద తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని సమీపం లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ యువకుడికి 50 కుట్లు పడగా… ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువకుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గతంలో కూడా కోయంబత్తూరుకు చెందిన జయంతి, కేరళకు చెందిన రాకేష్ సహజీవనం చేసేందుకు నిరాకరించడంతో రాకేష్ పై యాసిడ్ తో దాడి చేసింది. ఆ తర్వాత భయంతో తాను కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అలానే కేరళలో పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్‌ పోసింది. రాను రాను ఈ ఘటనలు చూస్తుంటే మగవారి కోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకు రావలసిన అవసరం ఉందని అనిపిస్తుంది.

Exit mobile version