Sambhal: ఉత్తర ప్రదేశ్ లో ఓ కోల్డ్ స్టోరేజ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. యూపీలో ని సంభాల్ జిల్లాలో బంగాళదుంపలు నిల్వ చేసే స్టోరేజ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు ధ్రువీకరించారు.
చాందౌసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్ట్ స్టోరేజ్ పై కప్పు హఠాత్తుగా కుప్పకూలింది.
ఆ సమయంలో స్టోరేజ్ లోప బంగాళదుంపల బస్తాలను వేస్తున్న వర్కర్స్ శిథిలాల కింద చిక్కుకున్నారు.
దాదాపు 24 మంది కూలీలను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
సహాయ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శలభ మాథూర్ వెల్లడించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేశారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 50 వేలు ప్రకటించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్ స్టోరేజీలో ఉన్న వారిలో 6 గురికి స్వల్పగాయాలు అయ్యాయి.
వారు చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురికి చికిత్స జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ బన్సల్ తెలిపారు.
పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజీని మూడు నెలల క్రితమే నిర్మించారు.
ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే హడావుడిగా ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగనట్టు పోలీసులు చెప్పారు.
అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ సామర్థ్యానికి మించి బంగాళ దుంప బస్తాలు నిల్వ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి దారి తీసినట్టు భావిస్తున్నారు.