Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కులాలు వేరైనా.. చివరకి పెద్దలు ఒప్పుకున్న కూడా ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి.
ఆత్మహత్యకు కారణం ఇదే.. (Mancherial)
ఆ ప్రేమ జంట కులాలు వేరు.. అయినా పెద్దలను ఒప్పించి మరి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే వారిని ఊహించని విషాదం వెంటాడింది. ఆర్థిక పరిస్థితులు వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే వార్త తట్టుకోలేక ప్రియురాలు సైతం సూసైడ్ చేసుకుంది. ఈ విషాద ఘటన.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దొనబండ గ్రామానికి చెందిన నాగవెళ్లి శ్రీకాంత్ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సంఘవి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. వీరిద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. కులాలు వేరైన వారి వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు.. ఆర్థిక సమస్యలు.. అప్పులు పెరగడంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షణికావేశంలో వీరు తీసుకున్న నిర్ణయం.. ఇరు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది.
చనిపోదామని నిర్ణయించుకొని.. బతకాలని ఆశపడ్డారు
పెద్దలు పెళ్లీకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇరు కుటుంబాలకు తీవ్రంగా కలచివేస్తోంది. శ్రీకాంత్.. సంఘవిని తీసుకొని ఎల్లంపల్లి జలాశయం వైపునకు ఆటోలో వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అప్పులు పెరిగిపోయాయని.. పెళ్లి చేసుకుంటే జీవనం కష్టంగా మారుతుందని శ్రీకాంత్ తన ప్రియురాలితో చెప్పాడు. ఈ సమయంలో పెళ్లి చేసుకోలేనని.. తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయానికి లోనైన సంఘవి సైతం.. పురుగుల మందు తాగింది. ఆ తర్వాత ప్రాణం మీద ఆశతో.. ఎలాగైనా బతకాలని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. అదే ఆటోలో ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య ప్రేమికుల జంటలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదని.. మానసిన నిపుణులు సూచిస్తున్నారు.