Gang Rape: విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ నెల 18న ఓ లాడ్జికి తీసుకు వెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత తన స్నేహితుడిని పిలిపించి అత్యాచారం చేయించాడు. దీతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్‌కె బీచ్‌కి వెళ్ళింది.
లాడ్జిలో బంధించి..( Gang Rape)
బీచ్‌లో పర్యాటకుల ఫొటోలు తీసే వ్యక్తి అక్కడ ఏడుస్తున్న బాలికని చూశాడు. జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన నాల్గో పట్టణ పోలీసులు 22వ తేదీన ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు.
మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ పంచుకోలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన ఎనిమిది మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఝార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు.