Gang Rape: విశాఖపట్టణంలో పద్నాలుగేళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని 104 ఏరియా బాపూజీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండడం, చదువులో శ్రద్ధ తగ్గడం వంటివి గమనించిన తల్లి గట్టిగా నిలదీసింది. దీనితో తల్లితో జరిగిన విషయాన్నిబాలిక వివరించింది కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎయిర్ పోర్ట్ సిఐ బిఎండి ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుని దిశ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు.
బాలిక చదువుతున్న పాఠశాలలోనే ప్యూన్ గా..(Gang Rape)
104 ఏరియా సుభాష్ నగర్‌లో బాలిక కుటుంబ సభ్యులు ఉంటున్న అపార్ట్ మెంట్లో నివాసముంటున్న సత్యారావు బాలిక చదువుతున్న పాఠశాలలో ప్యూన్ గా పని చేస్తున్నాడు. బాలికను లోబరుచుకుని శారీరకంగా కలిశాడు. అక్కడితో ఆగకుండా వివస్త్రగా ఉన్న సమయంలో ఫొటో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నాడు. సత్యారావు తన స్నేహితులైన మరో నలుగురితో కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు సత్యారావుని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యారావు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందుతులపై 376 క్లాజ్ వన్, 376డి, 5సీ, 5ఎఫ్, 5జీ, 5ఐ, 5ఓ, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దిశ డిసిపి వివేకానంద ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలికకి విశాఖ కెజిహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.