Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అత్తపై ఓ కోడలు విచక్షణ మరిచి దాడి చేసింది. వెస్ట్ ఢిల్లీ లోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఈ మానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా కు చెందిన సుర్జిత్ సోమ్ అనే వ్యక్తి తన భార్య శర్మిష్ఠ, 16 ఏళ్ల కూమార్తెతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. సుర్జిత్ తల్లి హసి సోమ్ (86) మాత్రం కోల్‌కతాలోనే నివాసం ఉండేవారు. అయితే ఆమె గత కొంత కాలంగా కీళ్లనొప్పులతో బాధపడతోంది. దీంతో సుర్జిత్ గత ఏడాది తల్లిని ఢిల్లీలోని తన వద్దకు తీసుకొచ్చాడు.
తలపై బలమైన గాయం(Delhi)
అయితే , సుర్జిత్ ఇంటి ఎదురుగా ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని తల్లిని అక్కడ ఉంచాడు. ఏప్రిల్ 29 వ తేదీ సుర్జిత్ స్నేహితుడు ఒకరు హసిసోమ్‌ను కలవడానికి ఆ ప్లాట్‌కు వెళ్లాడు. అయితే, ఆమె బెడ్‌రూంలో కనిపించకపోవటంతో ఫ్లాట్ అంతా వెతికాడు. కిచెన్ లోకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో అతను.. సుర్జిత్‌కు సమాచారం అందించాడు. హుటా హుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. తలపై బలమైన గాయం కావటంతో ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
సీసీటీవీ ఫుటేజీ ద్వారా..(Delhi)
ఈ ఘటనపై సుర్జిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. హసి సోమ్‌ను ఎవరో బలంగా కొట్టినట్టు డాక్టర్లు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో తల్లి అంత్యక్రియల తర్వాత సుర్జిత్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. అందులో తన భార్య ఓ వంటపాత్రను తీసుకొని తల్లి వద్దకు వెళ్లటం చూశాడు సుర్జీత్. సీసీ ఫుటేజీ ఆధారంగా అతడు తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే విధంగా నాన్నమ్మతో తన తల్లి సరిగా ప్రవర్తించదని సుర్జీత్ కుమార్తె కూడా తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న తన అత్తకి సేవ చేయలేకే కోడలు ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం అసలు కారణం వెల్లడిస్తామని తెలిపారు.