Kidnap Case : దేశ వ్యాప్తంగా రోజురోజుకీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.. తప్ప తగ్గడం లేదని సామాన్య ప్రజలు అంతా భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో నేర పూరిత ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి బస్టాండ్‌లో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని ఫ్లాట్ ఫారం 3 దగ్గర రెండేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయాడు.
చెన్నై వరసవక్కంకు చెందిన చంద్రశేఖర్-మీనా దంపతుల కుమారుడు అరుల్ మురుగన్.. శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై ఫ్లాట్ ఫామ్ దగ్గర వేచి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అర్థరాత్రి 2 గంటలకు బాలుడు కనబడడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితో పాటు కిడ్నాపర్ ను గుర్తించారు.
స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఈ వీడియోని గమనిస్తే.. కిడ్నాపర్ వైట్ షూ.. గ్రీన్ కలర్ షర్ట్ తో వేసుకుని ఉన్నాడు. అతని వయస్సు సుమారు 32 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ కోసం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేశారు.
అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన అవిలాల సుధాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఏర్పేడు మండలం మాధవ మాల గ్రామంలో ఉన్న తన అక్క ధనమ్మ ఇంటికి బాలుడిని తీసుకెళ్లాడు. వేరే వాళ్ళు డబ్బు ఇవ్వాలని.. అక్కడికి వెళ్లి తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ధనమ్మ ఈ సందర్భంగా తమ్ముడు అవిలాల సుధాకర్ ని ఈ బాలుడు ఎవరు అని ప్రశ్నించింది. తన స్నేహితుడు కుమారుడని నీ దగ్గరనే ఉంచుకోమని చెప్పి అవిలాల సుధాకర్ అర్ధరాత్రి వెళ్ళిపోయాడు.
ఈరోజు (అక్టోబరు 3) మంగళవారం ఉదయం ధనమ్మ ఇంటిముందు ఆడుతున్న రెండేళ్ల బాలుడిని స్థానికులు గుర్తుపట్టి గ్రామ సర్పంచ్ కరీముల్లా కు తెలిపారు. ఆయన వెళ్లి ధనమ్మను నిలదీయడంతో అనుమానం వచ్చిన కరీముల్లా వెంటనే ఏర్పేడు పోలీసులకి సమాచారం అందించారు. ఏర్పేడు సీఐ శ్రీహరి తన సిబ్బందితో వెళ్లి రెండేళ్ల బాలుడితో పాటు ధనమ్మను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం బాబుని తల్లిదండ్రులకు అప్పగించారు.