Hyderabad Crime News: నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి. గతంలో చైన్ స్నాచింగ్ లతో రోడ్లమీద ఒంటరిగా తిరిగే ప్రజల్ని టార్గెట్ చేసిన దుండగులు ఇప్పుడు స్టైల్ మార్చి కొత్త పద్దతిలో దొంగతనాలను ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి అతని వద్ద ఉన్న బంగారాన్ని అపహరించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పవన్ అనే వ్యక్తిపై దుండగుడు దాడి చేశాడు. కళ్లలో కారం కొట్టి కత్తితో పొడిచి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో 14 తులాల బంగారం పోయినట్లు సమాచారం అందుతుంది.
కాగా హిమాయత్ నగర్ లోని రాధే జ్యూవెల్లర్స్ షాప్ లో బంగారం కొనుగోలు చేసి సికింద్రాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. బాధితుడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.