Maniac killed Girlfriend’s Father: విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటోన్న కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడమే పాపమైంది. నడిరోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. నిన్నరాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్లెదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
కుమార్తె జోలికి రావద్దని మందలింపు.. (Maniac killed Girlfriend’s Father)
విజయవాడ బృందావన్ కాలనీలో భవానీపురం చెరువు సెంటర్‌కు చెందిన రామచంద్రప్రసాద్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె నగరంలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. ఇక విద్యాధరపురానికి చెందిన గడ్డం మణికంఠ విజ్ఞాన విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు కొన్నేళ్ల క్రితం యువతితో పరిచయం ఏర్పడింది. వీరి విషయం తెలిసిన రామచంద్ర ప్రసాద్ కుమార్తెను మందలించాడు. చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను కూడా పలుమార్లు హెచ్చరించాడు. తండ్రి ఒత్తిడితో కొద్దిరోజులుగా ఆమె అతడిని పక్కనపెట్టింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని మణికంఠ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు.
ఇది తెలిసి రామచంద్ర ప్రసాద్ కొంతమందితో వెళ్లి మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. అప్పటి నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మణికంఠ రామచంద్ర ప్రసాద్ పై పగ పెంచుకున్నాడు. నిన్న రాత్రి హరిచంద్రప్రసాద్ కుమార్తెను వెంటబెట్టుకుని రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే రామచంద్రప్రసాద్‌పై దాడి చేసేందుకు కత్తితో బృందావన్ కాలనీలో మాటు వేశాడు. షాపు మూసేసి స్కూటర్‌పై బయల్దేరిన తండ్రి కూతుళ్లను బైక్‌తో వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. అనంతరం కత్తితో దారుణంగా కూతురు ముందే నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.