Site icon Prime9

Suicide Case : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. భవనం పైనుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య

another suicide in basara iiit campus in nirmal district

another suicide in basara iiit campus in nirmal district

Suicide Case : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే.. ఇప్పుడు మళ్ళీ మరో విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన లిఖిత హాస్టల్ నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. కానీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది మాత్రం ఆమె ప్రమాదవశాత్తూ భవనం పై నుంచి పడి మృతి చెందినట్లు వెల్లడించారు.

ఈ ఘటనలో భవనంపై నుంచి పడటంతో లిఖితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించే క్రమంలో విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా లిఖిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిఖిత నిజంగానే భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ పడిందా అనే ప్రశ్నలు అందరికీ తలెత్తుతున్నాయి..?

అసలు ఆ సమయంలో ఆమె నాలుగో అంతస్తుకు ఎందుకు వెళ్లింది? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీపిక మృతి ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి చెందడటంతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Exit mobile version