Site icon Prime9

Blue Sky: ట్విట్టర్ కు పోటీగా “బ్లూస్కై”.. ట్విట్టర్ మాజీ సీఈవో డోర్సే కొత్త యాప్

jack dorse blue sky new app

jack dorse blue sky new app

Blue Sky: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత అక్కడి పరిణామాలన్నీ మారిపోయాయి. ట్విట్టర్ లోని పలువురు కీలక ఉద్యోగులను వారి బాధ్యత నుంచి ఆయన తొలగించారు. మరియు మరికొంత మందిని కూడా తొలగించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సే ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి పని పూర్తయినట్లు ఆయన తెలిపారు.

ఈ కొత్త సామాజిక మాధ్యమ వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గత మంగళవారం నాడు ఓ బ్లాగ్‌లో డోర్సే స్వయంగా పేర్కొన్నారు. ఒకసారి ఈ పరీక్షలన్నీ పూర్తయితే, దాన్ని పబ్లిక్‌ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బ్లూస్కై అనేది ‘అథెంటికేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రోటోకాల్‌’పై పనిచేస్తుందని డోర్సే పేర్కొన్నారు. అనగా ఒక్క సైట్‌ ద్వారా కాకుండా పలు సైట్ల ద్వారా దీనిని నడిపించాల్సి ఉంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని, యూజర్ల డేటాను తమ సొంతం చేసుకోవాలని భావించే వారికి బ్లూస్కై గట్టిపోటీగా నిలుస్తుందని డోర్సే తెలిపారు.

ఇకపోతే గత ఏడాది నవంబరులో జాక్‌ డోర్సే ట్విటర్‌ సీఈఓ పదవికి రాజీనామా చేసి పరాగ్‌ అగర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం తర్వాత ట్విటర్‌తో ఉన్న అన్ని సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నారు. తొలుత ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడాన్ని డోర్సే స్వాగతించారు కూడా. కానీ ఆ తర్వాత ట్విటర్‌లో జరిగిన పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.

ఇదీ చదవండి: ట్విటర్ లో సినిమాలు, గేమ్స్.. ఆ దిశగా ఎలన్ మస్క్ అడుగులు

Exit mobile version