IPhone: వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు. దేహణహళ్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన తయారీ యూనిట్ లో 2024 ఏప్రిల్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఫాక్స్ కాన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
దాదాపు రూ. 13,600 కోట్లతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేసినట్టు చెప్పారు. జూలై 1 నాటికి దేహణ హళ్లి లోని ఐటీఐఆర్ ప్రాంతంలోని 300 ఎకరాల స్థలాన్ని ఫాక్స్ కాన్ కు అప్పజెబుతామన్నారు. ప్రాజెక్టు కు కోసం ప్రతిరోజు 50 లక్షల లీటర్ల నీరు, నాణ్యమైన విద్యుత్, రోడ్లు సహా ఇతర మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కొత్తగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
50 వేల ఉద్యోగావకాశాలు(IPhone)
అదే విధంగా ఫాక్స్ కాన్ కంపెనీ లో పని చేసేందుకు కావాల్సిన నైపుణ్యాలను కూడా తెలపాలని కంపెనీని కోరామన్నారు. దీంతో ఆయా నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేయవచ్చన్నారు. 50 వేల ఉద్యోగావకాశాలు రానున్నట్టు ఆయన తెలిపారు. కాగా, మూడు దశల్లో ఈ ప్రాజెక్టును ఫాక్స్ కాన్ పూర్తి చేయనుంది. అన్ని దశలు పూర్తి అయితే ఈ ప్లాంట్ నుంచి ఏటా 2 కోట్ల ఫోన్లు తయారవుతాయని అంచనా వేస్తున్నారు.