Site icon Prime9

Anil Agarwal: మీకు తెలుసా.. సెమీకండక్టర్ ప్లాంట్ కు గుజరాత్ కన్నా మహారాష్ట్ర ఎక్కువే ఇస్తానంది..

semiconductor-plant-gujarat

 India’s first semiconductor plant: వేదాంత లిమిటెడ్ మరియు తైవాన్ సెమీకండక్టర్ దిగ్గజం ఫాక్స్‌కాన్ గుజరాత్‌లో సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే ప్రొడక్షన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి $19.5 బిలియన్ (రూ.1.54 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. అయితే, మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఒప్పందం పై దుమ్మెత్తిపోయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. వేదాంత-ఫాక్స్‌కాన్ ఒప్పందం గుజరాత్‌కు ఎలా వెళ్లిందనే దాని పై విచారణ జరిపించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే కోరడంతో ఇదంతా మొదలైంది. కాంగ్రెస్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి అధికారం నుండి గద్దె దిగిన శివసేన, ఒప్పందం పై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పై విరుచుకుపడింది. షిండేను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రతిగా బీజేపీ తన పాలనలో ఉన్న గుజరాత్ కు ఈ ప్లాంట్ ను తరలించుకుపోయిందని మహారాష్ట్ర నుండి గుజరాత్‌కు వెళ్లిందని సేన తన పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది.

వేదాంత-ఫాక్స్‌కాన్ ఒప్పందాన్ని మహారాష్ట్ర నుండి గుజరాత్‌కు వెళ్లడం పై ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ఈ కార్పొరేట్ దిగ్గజాలకు రెండు రాష్ట్రాలు ఈ క్రింద చూపిన ఆఫర్ లు ఇవ్వడానికి సిద్దమయ్యాయి.

1. గుజరాత్ సెమీకండక్టర్ ప్లాంట్ కోసం వేదాంత-ఫాక్స్‌కాన్‌కు రూ.28,000 కోట్ల మూలధన రాయితీని ఇచ్చింది. మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ రూ.40,000 కోట్లు.
2. అహ్మదాబాద్‌లోని ధోలేరా వద్ద రెండు కంపెనీలకు 200 ఎకరాల భూమిని 75 శాతం చొప్పున గుజరాత్ ఇచ్చింది. పూణె జిల్లాలోని తాలెగావ్ ఫేజ్ IV వద్ద మహారాష్ట్ర 1,100 ఎకరాల భూమిని ఇవ్వడానికి సిద్దమయింది. ఇందులో 400 ఎకరాలు ఉచితంగా అందించగా, మిగిలిన 700 ఎకరాలు ప్రస్తుత ధరలో 75 శాతం చొప్పున అందిస్తామని తెలిపింది..
3. గుజరాత్‌లోని భూపేంద్ర పటేల్ ప్రభుత్వం పదేళ్ల పాటు యూనిట్‌ రూ.2 చొప్పున విద్యుత్‌ను అందిస్తామని తెలిపింది.మహారాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు యూనిట్‌కు రూ.3 చొప్పున 1,200 మెగావాట్ల విద్యుత్‌ను అందించింది. అలాగే పదేళ్లపాటు విద్యుత్‌ సుంకంపై 7.5 శాతం మినహాయింపు ఇచ్చింది.
4. గుజరాత్ ప్రభుత్వం వేదాంత-ఫాక్స్‌కాన్ డీల్‌కు 5 శాతం సబ్సిడీతో కూడిన స్టాంప్ డ్యూటీ మినహాయింపును ఇచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వంకూడ ఇదేవిధమైన మినహాయింపు ఇస్తానని తెలిపింది.
5. మహారాష్ట్ర రూ337 కోట్ల నీటి సబ్సిడీ ఆఫర్‌ను మరియు వ్యర్థాల నిర్వహణ కోసం రూ812 కోట్ల సబ్సిడీని ఇవ్వడానికి సిద్దమయింది.

అంటే ఏవిదంగా చూసుకున్నా సెమీకండక్టర్ ప్లాంట్ కోసం గుజరాత్ కన్నా మహారాష్ట్ర ఎక్కువే ఇవ్వడానికి సిద్దమయింది. అయినా సరే ప్లాంట్ గుజరాత్ కు తరలిపోయింది.

దీనిపై వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ వృత్తిపరమైన మరియు స్వతంత్ర సలహాల ఆధారంగానే కంపెనీ గుజరాత్‌ను ఎంచుకుందని తెలిపారు. మేము కొన్ని నెలల క్రితం గుజరాత్‌ పై మా అంచనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాము. కానీ మహారాష్ట్ర నాయకత్వంతో జూలైలో జరిగిన సమావేశంలో, వారు పోటీ ఆఫర్‌తో ఇతర రాష్ట్రాలను అధిగమించడానికి భారీ ప్రయత్నం చేశారు. మేము గుజరాత్‌ను ఎంచుకున్నాము” అని అగర్వాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Exit mobile version