Gold Rates: కాస్త నెమ్మదించిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇటీవలే తగ్గినట్లు తగ్గిన పసిడి ధర మళ్లీ పైకి ఎగబాకింది.
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.
ఫలితంగా ధరలు పెరిగాయనేది నిపుణుల మాట. దేశీయం గానూ ఆ ప్రభావం కనిపించింది.
దేశ రాజధాని ఢిల్లీలో స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఒక్కరోజే ఏకంగా రూ. 970 పెరిగి రూ. 56,550 కి చేరింది.
వెండి కిలో సైతం రూ.1600 మేర పెరిగి రూ. 63,820కి పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు ధర 1875 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. వెండి 20.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇప్పుడు బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు వెల్లడించారు.
అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు చేపడుతున్నా కూడా యూఎస్ ఎకమిక్ డేటా పాజిటివ్‌గా రావడం,
అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీయడం లాంటి పరిణామాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు తరలించడం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది.
దీంతో 5వారాల గరిష్ఠానికి బంగారం ధర చేరిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ వెల్లడించారు.
పెద్ద ఎత్తున డిపాజిటర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది మరువక ముందే అమెరికాలో మరో బ్యాంక్ దివాలా తీసింది.
క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’(ఎఫ్‌డీఐసీ) తన నియంత్రణలోకి తీసుకుంది. గత ఏడాది ముగిసే నాటికి సిగ్నేచర్ బ్యాంక్ కు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి.
అయితే, ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్‌డీఐసీ పేర్కొంది. అందుకోసం తాత్కాలికంగా ఓ బ్రిడ్జ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది.