Boeing: భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి యువతకు ఉద్యోగావకాశ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కల్హౌన్ పేర్కొన్నారు. భారతదేశంలో వాణిజ్య వైమానిక రంగం విస్తరణలో తాము కీలక పాత్ర పోషిస్తామని ఆయన వెల్లడించారు. ‘‘వేగంగా విస్తరిస్తున్న భారత వైమానిక వాణిజ్య మార్కెట్, వాయుసేన యుద్ధ సన్నద్ధత, ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించడాన్ని బోయింగ్ గర్వకారణంగా భావిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో 5,000 మంది నిపుణులతో బోయింగ్ బృందం సృజనాత్మకంగా పనిచేస్తూ.. ప్రధాని మోదీ చేపట్టిన మేకిన్ ఇండియాకు మద్దతు ఇస్తోంది’’ అని సోమవారం కల్హౌన్ తెలిపారు. భారత్‌లో బోయింగ్ పెట్టుబడులపై ఆయన స్పందించారు. అవి తన బోయింగ్ కంపెనీకి భారత్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు.. అమెరికా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తూ సానుకూల దిశలో పయనించేలా తీసుకెళుతున్నాయన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన సమయంలో బోయింగ్ సీఈవో కల్హౌన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో 80 ఏళ్లుగా ఉన్న బంధం ప్రాధాన్యతపై వారిద్దరూ చర్చించారు. గతంలో పారిస్ ఎయిర్ షో సందర్భంగా భారత్‌తో కొత్త సర్వీస్ కాంట్రాక్టులను బోయింగ్ ప్రకటించింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా నుంచి 290 విమానాలకు ఆర్డర్ పొందినట్లు బోయింగ్ కంపెనీ తెలిపింది.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. మైక్రాన్, అప్లైడ్ మెటీరియల్స్, జీఈ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడుల పెట్టాలని వారిని కోరారు.