Air Tickets: ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని.. టికెట్ ధరల పెరుగదలపై పర్యవేక్షణ జరపాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కేంద్రం సూచనలు చేసింది. ప్రధానంగా గో ఫస్ట్ విమాన సర్వీసులు నడిచిన రూట్స్ లో ఈ టికెట్ ధరలు అధికంగా ఉన్నట్టు గుర్తించడంతో ఈ వ్యాఖ్యలు చేసింది. విమానయాన అడ్వైజరీ గ్రూప్ తో జరిగిన సమావేశంలో ధరల పెరుగుదల అంశాన్ని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రస్తావించారు.
టికెట్ ధరలను సంస్థలే పర్యవేక్షించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ బుకింగ్ డిజిగ్నేటర్, టికెట్ల రిజర్వేషన్ కు ఉపయోగించే పద్దతికి లోబడే ఈ మెకానిజం ఉండాలని ఆయన సూచనలు చేశారు. ఈ అంశాన్ని డీజీసీఏ పర్యవేక్షిస్తుందన్నారు. అదే విధంగా ప్రకృతి విపత్తులు, అను కోని సంఘటనలు సంభవించినపుడు టికెట్ ధరలు పెరగకుండా ఎయిర్ లైన్స్ మానవతా దృక్పథంతో ఉండాలని ఆయన అన్నారు.
అదే విధంగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు ఉచిత కార్గో సేవలందించాలని ఎయిర్‌లైన్స్‌ను కోరినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కాగా, దివాలా ప్రకటించిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేసింది. సాధారణంగా వేసవి కావడంతో విమాన సర్వీసులకు డిమాండ్ ఉంటుంది. అదే సమయంలో గో ఫస్ట్ సర్వీసులు రద్దు కావడం వల్ల ధరల పెరుగుదలకు కారణమైంది.
దివాలా ప్రకటించిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ నుంచి విమానాలు, ఇంజన్లను తిరిగి స్వాధీనం పరుచుకునేందుకు అనుమతించాలని కోరుతూ వాటిని అద్దెకిచ్చిన మూడు సంస్థలు.. జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. లెస్సర్స్ పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ విషయంపై వారం లోపల స్పందించాలని గో ఫస్ట్ దివాలా పరిష్కార నిపుణుడినికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 15న చేపట్టనున్నట్లు బెంచ్ తెలిపింది.