Munugode: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. బైపోల్స్ వేల రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో రాత్రికి రాత్రే జేపీ నడ్డాకు సమాధి కట్టడం కలకలం రేపుతుంది.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టారు. రాత్రికి రాత్రే వెలిసిన సమాధి నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సమాధి కట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. 2016లో మర్రిగూడలో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించారు. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం అదే ఏడాది చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 8.2 ఎకరాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే నడ్డా హామీ ఇచ్చి 6 ఏళ్లు గడిచినా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ రాలేదు. కాగా ఈ విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికీ వివాదం నడుస్తోంది. అయితే గతంలో రీసెర్చ్ సెంటర్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఇప్పుడు జేపీ నడ్డా సమాధి వెలిసింది. ఫ్లోరెడ్ బాధితులే ఇలా నిరసన తెలిపారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలే ఈ పని చేశారంటూ ఆరోపిస్తున్నారు. మునుగోడులో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే బాధ్యులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి మునుగోడుపై నోట్ల దందా.. రూ.19లక్షలతో పట్టుబడిన కారు..!