Site icon Prime9

Chandra Mohan : సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి .. షాక్ లో టాలీవుడ్ ..

senior actor chandramohan passed away

senior actor chandramohan passed away

Chandra Mohan : తెలుగు చిత్రసీమను తాజాగా ఓ విషాద వార్త కమ్మేసింది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు, హీరోగా వెండితెరపై రాణించిన చంద్రమోహన్ గురించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించగా నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ప్రస్తుతం చంద్రమోహన్ వయస్సు 81 సంవత్సరాలు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న చంద్రమోహన్‌ (Chandra Mohan) జన్మించారు. రచయిత్రి జలంధరను చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఈయన చాలా దగ్గరి బంధువు. తమ్ముడి వరస అవుతారు.

మొత్తంగా దాదాపు 932 సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. వీటిలో 175 సినిమాలు ఆయన హీరోగా చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఐదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేశారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు గా వెలిగిన వారందరూ తొలిగా చంద్రమోహన్‌ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది. అది నిజం కూడా అని పలువురు భాహాటంగానే ఒప్పుకున్నారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే.

1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు చంద్రమోహన్ (Chandra Mohan). ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. మొదటి సినిమాకే బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకొని అప్పట్లో అందరి దృష్టిలో పడ్డారు చంద్రమోహన్. అప్పట్నుంచి వరుసగా హీరోగా, సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత కమెడియన్ గా, సహాయ నటుడిగా కూడా అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్ రహీమ్‌, సుఖ దుఃఖాలు, సిరిసిరి మువ్వ, కురుక్షేత్రం, శంకరాభరణం చిత్రాలతో బాగా ఫేమస్‌ అయ్యారు. కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద చంద్రమోహన్‌తోనే ఎక్కువ సినిమాలు చేశారు. కాగా, గోపీచంద్‌ హీరోగా నటించిన ‘ఆక్సిజన్‌’ సినిమాలో చివరిగా చంద్రమోహన్ కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ చంద్రమోహన్ సినిమాలు చేశారు.

 

Exit mobile version