Ola Taxi: ఆన్లైన్ యాప్ల్ ద్వారా సేవలందిస్తున్న ప్రముఖ ట్యాక్సీ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఆటో సర్వీసులు నిలిపివేయాలని ఆయా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో ఓలా కార్యకలాపాలను నిర్వహించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్, ఉబర్, ర్యాపిడో సంస్థలకు నోటీసులు ఇచ్చింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ అందించాలని కోరింది. సరైన వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
నిబంధనల ప్రకారం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలని ఆటోల ద్వారా సేవలందించడం నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే అధిక చార్జీలు ఈ సంస్థలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని రవాణాశాఖ కమిషనర్ టీఎంకే కుమార్ వెల్లడించారు. రూల్ ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి కానీ, ఈ కంపెనీలు తొలి 2 కిలోమీటర్లకే రూ.100 వసూలు చేస్తున్నాయని కస్టమర్ల నుంచి పెద్దఎత్తును ఫిర్యాదులు అందాయని పేర్కొనింది.
ఇదీ చదవండి: డిజిటల్ రూపాయి (ఇ-రూపీ)పై ఆర్బీఐ తీపి కబురు