Apple Retail Stores: దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్‌లో స్టోర్లు తెరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతో స్టోర్స్ ఓపెన్ చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేసింది. భారత్ మార్కెట్ లో యాపిల్ అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు స్టోర్లు ప్రారంభం కానున్నాయని.. ఇది తమ విస్తరణ ప్రణాళికలో కీలక మైలురాయిగా అని యాపిల్ తెలిపింది. ముంబై, ఢిల్లీ లో యాపిల్ రెండు స్టోర్లను తెరవనుంది. ఈ నేపథ్యంలో యాపిల్ స్పందించింది.
కొత్త అనుభూతిని అందిస్తాం(Apple Retail Stores)
ఏప్రిల్ 18 న యాపిల్ తన తొలి స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేయనుంది. అదేవిధంగా ఏప్రిల్ 20న డిల్లీలో రెండో స్టోర్ తెరుచుకోనుంది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరు కానున్నారు. భారత్‌లో స్టోర్లు తెరవడం, కొత్త పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం సంస్థ కీలక మైలురాయి అని యాపిల్ పేర్కొంది. భారత్ లో రూపొందించిన రెండు స్టోర్లు ఇక్కడి వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాల కల్పించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది.
భారత్ లో అద్భుత మైన శక్తి
‘భారత్ లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాగి ఉంది. యాపిల్ వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం, కొత్త ఆవిష్కరణల కోసం కలిసి పనిచేయడం ద్వారా మా భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి సంతోషిస్తున్నాం’ అని సంస్థ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాపిల్ ఎప్పటి నుంచో భారత్‌లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2017 లో తొలిసారి ఐఫోన్ల తయారీ చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరలో సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన యాపిల్ ఎగుమతులు ‘మేడిన్ ఇండియా’వే కావడం విశేషం.