Amaravati: అమరావతి మహిళలను కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుతోపాటు, కృష్ణంరాజు, ఓ టీవీ ఛానల్ యాజమాన్యంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష.. శనివారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కొమ్మినేనితో పాటు, కృష్ణంరాజు, మీడియా ఛానల్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఆయనను మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.