Prime9

Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం.. ముగ్గురు మృతి.. స్పందించిన సీఎం జగన్

Bus Accident : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం. ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బ్రేక్ ఫెయిలయ్యి బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

YouTube video player

ఈ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన పూర్తి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. కాగా.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు ఆర్టీసీ కార్పొరేషన్ తరపున రూ. 5 లక్షలు పరిహారంగా అందిస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar