Vijay Govindam: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి గంటల సమయం పడుతుంది. కానీ, ఐఆర్సీసీటీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీ ద్వారా ఉచితంగా, సులభంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ తో వరుస సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ‘విజయ్ గోవిందం’ పేరుతో తిరుమల ప్యాకేజీని ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. ఈ ప్యాకేజీలో తిరుమలతో పాటు తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. మూడు రోజులు, రెండు రాత్రులతో ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది.
ప్యాకేజీ ఇలా..(Vijay Govindam)
తిరుమల ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 5.25 గంటలకు హైదరాబాద్ లో రైలు బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో ఈ రైలును ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం ఈ రైలు తిరుపతి చేరుకుంటుంది. కొంత సమయం బస తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి… తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత పర్యాటకులను అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఈ రైలు లింగంపల్లికి 6.55 గంటలకు రైలు చేరుకుంటుంది.
ధరలు ఏంటంటే..
తిరుమల టూర్ ప్యాకేజీలో ఐఆర్సీటీసీ కంఫర్ట్, స్టాండర్ట్ ధరలను అందుబాటులో ఉంచింది. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్‌కు రూ. 3,800, సింగిల్ షేరింగ్‌కు రూ. 4,940 లుగా నిర్ణయించింది. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్‌కు రూ. 5,660, సింగిల్ షేరింగ్ ధర రూ. 6,790 గా ఉంది. అయితే కంఫర్ట్ ప్యాకేజీలో 3rd ఏసీలో ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. అదే విధంగా ఏసీ హోటల్, ఏసీ వాహనంలో ప్రయాణం, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ఉంటాయి. అలాగే ఈ ప్యాకేజీకి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకునే పర్యాటకులు www.irctctourism.com వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.