Prime9

Chhattisgarh-Telangana Encounter: తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి!

Encounter at Chhattisgarh-Telangana State Border: ఛత్తీస్‌గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. కర్రెగుట్టల ప్రాంతంలో మూడు రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 

కర్రెగుట్టల కేంద్రంగా..
కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోలు పెద్దసంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు పాల్గొన్నారు. సుమారు ఐదు వేలమంది భద్రతా బలగాలతో గాలింపు కొనసాగుతోంది.

 

భద్రతా బలగాల కూంబింగ్‌..
మరోవైపు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతున్నది. సుమారు మూడు వేల మందికిపైగా పోలీస్‌ బలగాలు, సీఆర్పీఎఫ్‌, కోబ్రా దళాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయి కీలక నేత హిడ్మా దళం కోసం గాలింపు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పోలీసులు బచావో కర్రెగుట్టలు పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. సుమారు 250 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను వేలాదిమంది బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. మావోయిల కదలికల ప్రచారం, పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

 

రెండు హెలికాప్టర్ల మోహరింపు..
వెంకటాపురం కస్తూర్బా పాఠశాల ఆవరణలో భద్రతా బలగాల అధికారులు బుధవారం రెండు హెలికాప్టర్లను మోహరించారు. హెలిప్యాడ్‌ వైపు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ములుగు ప్రాంతంలో ఇంత పెద్దస్థాయిలో కూంబింగ్‌ నిర్వహించడం ఇదే మొదటి సారి అని సమీప గ్రామాల ప్రజలు బెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar