Prime9

Revival of Kaleshwaram Project: కాళేశ్వరం పునరుద్ధరణకు చర్యలు.. ఏడుగురు నిపుణులతో కమిటీ

Revival of Kaleshwaram Project: రాష్ట్రంలోని అనేక ఎకరాలకు సాగునీరు, తెలంగాణకు తాగునీరు అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను లక్ష్మీ, సరస్వతి, పార్వతి పేర్లతో నిర్మించింది. అయితే గతేడాది మేడిగడ్డ బ్యారేజీలోని ఏడు నెంబర్ పిల్లరు కుంగిపోయింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారుపై భారీగా విమర్శలు వచ్చాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బ్యారేజీ కుంగిపోయిందని పలువురు ఆరోపించారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీపీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ పలువురు ఇరిగేషన్ అధికారులను, నేతలను విచారించింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

 

తాజాగా కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్ గా ఇరిగేషన్ రంగంలో అనుభవజ్ఞుడు, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యాను నియమించింది. కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులకు చోటు కల్పించారు. ఇందులో ఇద్దరు నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా సర్కార్ నియమించింది.

 

కమిటీలో చైర్మన్ ఏబీ పాండ్యాతో పాటు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓ అండ్ ఎం శ్రీనివాస్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ ప్రశాంత్ చంద్ర, సీఈ రామగుండం, రిటైర్డ్ సీఈ సత్యనారాయణ, హైడ్రాలిక్ ఎక్స్ పర్ట్ సతీష్, జియో టెక్నికల్ ఎక్స్ పర్ట్ రమణ మూర్తితో పాటు మరొకరికి చోటు కల్పించారు. కాగా కేంద్ర జల సంఘం పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని కమిటీ పనిచేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై కసరత్తు చేయనుంది. అలాగే బ్యారేజీలకు చేయాల్సిన సాంకేతిక పరీక్షలపై సూచనలు అందించనుంది.

 

Exit mobile version
Skip to toolbar