Bhatti Vikramarka participated in the revenue conference : రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మనుషులకు ఆధార్.. భూములకు భూధార్ : మంత్రి పొంగులేటి
అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. మనుషులకు ఆధార్ మాదిరిగానే భూములకు త్వరలో భూధార్‌ను తీసుకొస్తామని తెలిపారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3,500 మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నామన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విప్లవాత్మక చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భూముల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.