MLA Gopinath: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. ఎమ్మెల్యే గోపినాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి గోపినాథ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కాగా తీవ్ర అనారోగ్యంతో గురువారం తన ఇంట్లో కుప్పకూలిన ఎమ్మెల్యే గోపినాథ్ ను చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే సీపీఆర్ చేయడంతో ఆయన నాడి స్పందన సాధారణ స్థితికి చేరుకున్నా ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. కాగా గుండె వైద్య నిపుణులు 24 గంటలు పర్యవేక్షిస్తూ ఐసీయూలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యం అందిస్తున్నారు. కొంత సమయం గడిస్తేకానీ ఏ విషయం అనేది చెప్పలేమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే గోపినాథ్ ఆరోగ్యంతో తిరిగి రావాలని కుటుంబీకులు, పార్టీ నేతలు కోరుకుంటున్నారు.