4 Crore worth Ganja Seized in Bhadradri Kothagudem: వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఖమ్మంవైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్ ను పరిశీలించగా అందులో రూ. 4. 15 కోట్ల విలువైన సుమారు 830 కేజీల గంజాయిని గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఐచర్ వ్యాన్ వెనుక భాగంలో ఒక అర తయారు చేసి ప్యాకెట్ల రూపంలో దాచి ఉంచారని పోలీసులు గుర్తించారు.
కాగా గంజాయి పట్టుబడిన ఘటనపై ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడారు. నిన్న సాయంత్రం గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారని చెప్పారు. ఓ ఐచర్ వ్యాన్ లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి గంజాయిని లోడ్ చేసుకుని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కాగా గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న 9 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఐచర్ వ్యాన్, 2 మొబైల్ ఫోన్లు, గంజాయిని సీజ్ చేశామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.