UPI Transactions: దేశంలో యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. 2026- 27 నాటికి ఒక రోజు లావాదేవీలు 100 కోట్లకు చేరుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది.
భారత్‌లో యూపీఐతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. 2022-23 ఏడాది గాను రిటైల్ విభాగంలో 75 శాతం చెల్లింపులు యూపీఐ ద్వారానే జరిగాయని పీడబ్ల్యూసీ తెలిపింది. 2022-23లో మొత్తం 103 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని.. అందులో 83.71 బిలియన్లు యూపీఐ ద్వారానే చేశారని నివేధిక పేర్కొంది. ఇది 2026-27 నాటికి డిజిటల్ లావాదేవీల సంఖ్య 411 బిలియన్లకు చేరుకోగా.. అందులో 379 బిలియన్లు యూపీఐ ద్వారా జరుగుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఏటా 50 శాతం చొప్పున యూపీఐ లావాదేవీల్లో వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
యూపీఐ తర్వాత డిజిటల్ చెల్లింపుల కోసం అత్యధిక మంది డెబిట్, క్రెడిట్ కార్డులను వినియెగిస్తున్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మంచి వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. 2024-25 నాటికి డెబిట్ కంటే క్రెడిట్ కార్డు ద్వారా జరిగే చెల్లింపులే అధికంగా ఉంటాయని చెప్పింది. వచ్చే ఐదేళ్లలో క్రెడిట్ కార్డుల జారీలో ప్రతి ఏటా 21 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. అదే సమయంలో డెబిట్ కార్డుల జారీ 3 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని తెలిపింది. యూపీఐ ద్వారా చెల్లింపులు సులభం కావడం వల్లే డెబిట్ కార్డు వినియోగం తగ్గిపోతోందని పీడబ్ల్యూసీ పేర్కొంది.