Spam WhatsApp Calls: వాట్సాప్ లో వచ్చే స్పామ్, స్కామ్ కాల్స్‌ను ఈజీగా గుర్తించేందుకు త్వరలో మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది. కాలర్ గుర్తింపు యాప్ ట్రూ కాలర్ తన సేవలను వాట్సాప్ లో కూడా పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ట్రూకాలర్ సీఈవో అలన్ మమేది వెల్లడించారు. ప్రస్తుతం టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్‌ను మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.
స్పామ్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత ఫిల్టర్స్(Spam WhatsApp Calls)
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ లాంటి దేశాల్లో ఒక యూజర్‌కు సగటున రోజులో 17 టెలి మార్కెటింగ్ , స్కామ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది. వీటిని అడ్డుకునేందుకు మే 1 నుంచి టెలికాం నెట్‌వర్క్ ఆపరేటర్లు ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ సేవల్లో AI ఆధారిత స్పామ్ ఫిల్టర్స్‌ను ఉపయోగించాలని ట్రాయ్ సూచించింది. ఈ ఏఐ ఆధారిత ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్ కాల్స్‌తో పాటు మెసేజ్ లను గుర్తించి అడ్డుకుంటాయి. దీంతో టెలీ మార్కెటింగ్ సంస్థలు రూట్ మార్చి వాట్సాప్ ద్వారా యూజర్లకు కాల్స్ చేయడం ప్రారంభించాయి. గత రెండు వారాలుగా ఈ అంశంపై ఫిర్యాదులు వస్తున్నాయని.. వీటిని కట్టడి చేసేందుకు ట్రూ కాలర్ సేవలను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అలన్ మమేది తెలిపారు. ఈ అంశంపై టెలికాం ఆపరేటర్లతో ట్రూకాలర్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
వాట్సాప్ యూజర్లకు ట్రూ కాలర్ సేవలతో
వాట్సాప్‌కు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఈ యాప్ యూజర్లు తమకు తెలియని నంబర్ల నుంచి అభ్యంతరకర మెసేజ్‌లు, కాల్స్ వస్తే వాట్సాప్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అనంతరం సదరు ఖాతాలపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. అలా ప్రతి నెలా యూజర్ల ఫిర్యాదు, ఏఐ స్పామ్ ఫిల్టర్ల ద్వారా వేల సంఖ్యలో ఖాతాలపై వాట్సాప్ నిషేధిస్తుంది. ట్రూ కాలర్‌కు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్. ఈ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ యూజర్లు ఉంటే.. వారిలో 250 మిలియన్ యూజర్లు భారత్‌లోనే ఉండటం గమనార్హం.