Meta Verified: ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు. అయితే తాజాగా ఈ బ్లూ టిక్ విధానాన్ని మెటా ఈ నెల 7 నుంచి అందుబాటులోకి తెచ్చింది. మెటాకు చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో బ్లూ టిక్ కావాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, వెబ్ బేస్ట్ సబ్ స్క్రిప్షన్ కూడా తెచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ. 599 ను ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. బ్లూ టిక్ కోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. దీని వల్ల అకౌంట్ సేఫ్టీతో పాటు పలు రకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని మెటా వెల్లడించింది.
బ్లూ టిక్ కోసం(Meta Verified)
ముందు ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను ఓపెన్ చేయాలి. ఏ ప్రొఫైల్‌కు బ్లూ టిక్ కావాలో నిర్ణయించుకుని, ఆ తర్వాత సెట్టింగ్స్‌లో‘అకౌంట్ సెంటర్’అనే ఆప్షన్ ను సెలక్ట్ చేయాలి. అక్కడ మెటా వెరిఫైడ్ గుర్తు కనపడుతుంది. ఒక వేళ కనిపించకపోతే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వైరిఫైడ్ ఎంచుకొని పేమెంట్ చెల్లించాలి. మెటా కండిషన్స్ అన్నీ చదివిన తర్వాత ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే బ్లూ టిక్ డిస్ ప్లే అవుతుంది.
ఆ నిబంధనలతోనే
మెటా టిక్ పొందేందుకు కొన్ని కండిషన్స్ కూడా మెటా పెట్టింది. ఇండియాలో పుట్టి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బ్లూటిక్ ఇస్తామని మెటా తెలిపింది. అలా ఇచ్చే ముందు ఆ యూజర్ మునుపటి పోస్టుల గురించి కూడా తనిఖీ చేయనున్నట్టు వెల్లడించింది. అంతే కాకుండా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. వాటిలోని పేరు, ఫొటో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలోని వివరాలతో చెక్ చేసుకున్న తర్వాతే బ్లూ టిక్ ను ఇస్తారు.
ఎవరైనా బ్లూ టిక్ తీసుకునే వీలు
గతంలో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను ప్రముఖులు, వార్తా సంస్థలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు, రాజకీయ నాయకుల అకౌంట్లకు మాత్రమే ఇచ్చేవారు. ఇందుకోసం సోషల్ మీడియా సంస్థలకు కొన్ని వివరాలు సమర్పించాల్సి ఉండేది. వాటి ఆధారంగానే అకౌంట్ లకు బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చేది. ప్రస్తుతం ఆ కండిషన్ ను సడలించారు. నెలవారీ మొత్తం చెల్లించి ఎవరైనా బ్లూ టిక్ తీసుకునే వీలు ఉంది. ఇప్పటి వరకు మెటా బ్లూ టిక్ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది.