LinkedIn: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్డిన్ కూడా ఉద్యోగుల కోతలు విధించేందుకు సిద్ధం అయింది. కంపెనీలో దాదాపు 716 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా చైనాలో ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను కూడా క్లోజ్ చేస్తున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం లింక్డిన్ కంపెనీలో 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది ప్రతి త్రైమాసికంలోనూ కంపెనీ ఆదాయంలో వృద్ధి నమోదైంది. అయినా, ఉద్యోగుల తొలగింపు విషయంలో మాత్రం ఇతర కంపెనీలనే అనుసరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణం. కార్యకలాపాలను ప్రామాణీకరించడంతో పాటు వేగవంతమైన నిర్ణయాల కోసం వివిధ విభాగాలను తగ్గించడం కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ సీఈఓ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉద్యోగులకు లేఖ ద్వారా లే ఆఫ్స్ నిర్ణయాన్ని తెలియ జేశారు.
కాగా, మరో వైపు చైనాలో సవాల్‌తో కూడుకున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ‘ఇన్‌కెరీర్స్’ అనే జాబ్ యాప్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్టు లింక్డిన్ తెలిపింది. 2021లోనే ఈ నిర్ణయం తీసుకున్న.. ప్రస్తుతం దీన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 9 నాటికి దశల వారీగా ఇన్ కెరీర్స్ యాప్‌ను పూర్తిగా తొలగించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.