Reliance Jio: జియో నుంచి బ్లూటూత్ ట్రాకర్.. ఎలా పనిచేస్తుందంటే?

యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి..

Reliance Jio: యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి మరిచిపోయే అలవాటున్న వారికి ఈ ట్యాగ్ బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

 

వెల్‌కం ఆఫర్‌ కింద(Reliance Jio)

ఈ జియోట్యాగ్‌ ను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్యాగ్ అసలు ధర రూ. 2,199 గా జియో పేర్కొంది. అయితే, ప్రస్తుతం వెల్‌కం ఆఫర్‌ కింద రూ. 749లకే అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో, రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉంది. వైట్ కలర్ లో వచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్‌ బరువు 9.5 గ్రాములు. ఎక్కువగా మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు ఈ ట్యాగ్ ను తగిలించాలి. బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన జియోథింగ్స్‌ యాప్‌ కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ జియోట్యాగ్‌ తగిలించిన వస్తువును వదిలి ఎక్కువ దూరం వెళ్లిపోతే వెంటనే నోటిఫికేషన్‌ వస్తుంది.

 

 

సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా.. (Reliance Jio)

ఇండోర్‌లో 20 మీటర్లు, అవుట్‌ డోర్‌లో 50 మీటర్ల వరకు ఈ జియోట్యాగ్‌ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ట్యాగ్ లో మార్చుకునేందుకు వీలుగా CR2032 బ్యాటరీ ఉంది. ఈ గ్యాడ్జెట్ కు ఏడాది పాటు వారెంటీ ఇస్తున్నారు. జియోట్యాగ్‌ను పరికరాలను అటాచ్‌ చేసుకునేలా ఒక కేబుల్‌ కూడా వస్తోంది. జియోట్యాగ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రాక్‌ చేసే వీలుంది. ఒక వేళ ఫొన్ డ జియోట్యాగ్‌ను రెండుసార్లు ట్యాప్ చేస్తే ఫోన్‌ రింగ్ అవుతుంది.

ఈ ట్యాగ్‌ తీసుకున్న వారికి జియో మరో ప్రత్యేక ఆఫర్ ను అందిస్తోంది. జియోట్యాగ్‌ తగిలించిన వస్తువు పోతే.. దాన్ని జియోథింగ్స్‌ యాప్‌లోని జియో కమ్యూనిటీలో రిపోర్ట్‌ చేసుకునే వీలు కల్పించారు. దీంతో ఆ వస్తువు చివరిసారి నెట్‌వర్క్‌కు అందుబాటులో ప్రాంతం వివరాలు ఫోన్ కు నోటిఫికేషన్‌ వస్తుంది.