Twitter Logo: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. సంస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అన్నిస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్విట్టర్‌కు మారు పేరుగా నిలిచిన నీలం రంగు పక్షి లోగో స్థానంలో తాజాగా ‘X'(ఎక్స్)ను చేర్చారు. ఇక ట్విట్టర్ వెబ్‌సైట్‌ను కూడా ఎక్స్ డాట్ కామ్(X.com)తో అనుసంధానం చేశారు. ఈ క్రమంలో మస్క్ ఆలోచనలను గమనించినట్లయితే.. ‘ఎక్స్’కు ఉన్న ప్రాధాన్యత తెలుస్తోంది. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్నంతా కూడా ‘X’ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
మస్క్‌కు ఎక్స్ అంటే ఇష్టం..(Twitter Logo)
ఎలాన్ మస్క్‌కు ఎక్స్ అంటే అమితమైన ఇష్టం. 1990 నుంచి దీంతో మాస్క్‌కు అనుబంధం ఏర్పడింది. 1999లో ఎలాన్ మస్క్ X.com పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. ఆ తర్వాత అది పేపాల్ చేతిలోకి వెళ్లిపోయింది. అయితే, 2017లో ఎక్స్ డాట్ కామ్ డొమైన్‌ను ఎలాన్ మస్క్ మళ్లీ కొనుగోలు చేశారు. తనకు ఎంతో సెంటిమెంటుగా ఉన్న ఆ డొమైన్ తిరిగి తన వద్దకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆ సందర్భంలో మస్క్ వ్యాఖ్యానించారు. తిరిగి విక్రయించినందుకు పేపాల్‌కు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని వినియోగించే ప్రణాళిక ఏదీ లేదని.. ఎంతో సెంటిమెంట్ అని చెప్పారు. అప్పట్నుంచి ఎక్స్.కామ్‌ను వినియోగంలోకి తీసుకురాలేదు. తాజాగా, ట్విట్టర్‌కు అనుసంధానం చేసి మళ్లీ వెలుగులోకి తెచ్చారు.
ఇప్పటికే అనేక రంగాల్లో ప్రవేశించిన ఎలాన్ మస్క్.. దాదాపు అన్ని కంపెనీల్లో X అక్షరం ఉండేలా చూసుకుంటారు. 2002లో అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రారంభించిన సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రిక్ కారుమోడల్ ఎక్స్ చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరు లో కూడా ఎక్స్ అక్షరాన్ని చేర్చడం గమనార్హం. ట్విట్టర్ లోగో మార్పుపై తాజాగా, ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ట్విట్టర్ హెడ్ ఆఫీసుపై ఎక్స్ అనే పెద్ద అక్షరం దర్శనమిస్తోంది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది ట్విట్టర్ పిట్ట లోగోను మార్చడంపై మస్క్‌పై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.