WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ మొదలు కానుంది. లండన్‌లోని ప్రసిద్ద ‘ఓవల్’మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన సన్నద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను ఢీకొనేందుకు టీమిండియా కూడా బలమైన జట్టుతో పోరుకు దిగాలని చూస్తోంది. అయితే ఓవల్ గ్రౌండ్ లో పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఫైనల్ జట్టు ఎంపిక విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
రెండేళ్ల క్రితం భారత జట్టు తొలి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. 2019 -21 మధ్య జరిగిన 12 మ్యాచులు ఆడి ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే అసలు మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసి రన్నరప్ గా నిలిచింది. అప్పటి విజేత న్యూజిలాండ్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువగానే గెలిచిన ఆస్ట్రేలియా.. స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు పాయింట్స్ కోల్పోయి ఫైనల్ కు చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఇపుడు రెండు జట్లకు మొదటిసారి చాంపియన్ గా నిలిచేందుకు మరో ఛాన్స్ దక్కింది. ఈ హోరాహోరీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తిగా మారింది. కెప్టెన్లుగా రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ లకు ఈ డబ్య్లూటీసీ ఫైనల్ 50 వ టెస్టు కావడం విశేషం.
The Captains 👍
The Championship Mace 👌
The Big Battle 💪All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5
— BCCI (@BCCI) June 6, 2023
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ విన్నర్ కు వెండి గదతో పాటు రూ. 13 కోట్ల 20 లక్షలు (16 లక్షల డాలర్లు ), రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్ల 60 లక్షలు (8 లక్షల డాలర్లు) ప్రైజ్ మనీగా లభిస్తాయి. ఒక వేళ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’అయితే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.
సాధారణగా ఓవల్ పిచ్‌పై స్పిన్నర్స్ దే ఆధిపత్యం. అయితే ఇక్కడ టెస్టులు ఆగష్టు, సెప్టెంబర్ లో జరగడం వల్ల స్పిన్నర్లు లాభపడ్డారు. కానీ ఈసారి మ్యాచ్ జూన్ మొదటి వారంలోనే జరుగుతుంది. దీంతో ఎవరికీ పిచ్ పై పూర్తి స్పష్టత లేదు. పిచ్ లో పచ్చికను కత్తిరించినట్టుగా తెలుస్తోంది. బౌన్సీ పిచ్ ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నాడు. అదే జరిగితే పేసర్లకు అనుకూలం కాగా, మంచి షాట్స్ కూడా అవకాశం ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువగా ఉండటంతో బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగులు రాబట్టవచ్చు. తొలి మూడు రోజులు వర్షం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్ కుడా రిజర్వ్ డే కూడా ఉంది.
Focus 👌
Intensity ✅
Smiles 😊#TeamIndia geared up for the #WTC23 Final! 👍 👍 pic.twitter.com/wXJipLvDAE— BCCI (@BCCI) June 7, 2023
ఓవల్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడిపోయింది. 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
ఓవల్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 మ్యాచ్‌లను ‘డ్రా’ గా ముగించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొత్తంగా 106 టెస్టులు జరిగాయి. 44 టెస్టుల్లో ఆస్ట్రేలియా.. 32 టెస్టుల్లో టీమిండియా గెలుపొందాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. 29 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
ఆసీస్ తో జరిగిన చివరి నాలుగు టెస్టు సిరీస్ ల్లో భారత్ 2-1 తో గెలుచుకుంది.
143 ఏళ్ల ది ఓవల్ గ్రౌండ్ చరిత్రలో జూన్ లో ఓ టెస్టు జరగడం ఇదే తొలిసారి.
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ ( వికెట్ కీపర్), అశ్విన్/శార్దుల్, షమీ, సిరాజ్, ఉమేశ్/జయదేవ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియన్, స్కాట్ బోలండ్.