Wtc Final Aus vs Ind: టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. తొలి రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా.. ట్రావిస్ హెడ్(146 నాటౌట్ ) సెంచరీతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) గా ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్, షమి; శార్దాల్ కు తలో వికెట్ దక్కింది. రెండో రోజు ఆరంభంలో సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియా ను ఆలౌట్ చేయకపోతే ఈ మ్యాచ్ పై భారత్ ఆశలు గల్లంతు అవుతాయి.
కాగా, తొలిరోజు వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉండటంతో రోహిత్ శర్మ టాస్ గెలిసి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మ్యాచ్ ఆరంభంలో షమీ, సిరాజ్ లు బౌలింగ్ చేశారు. అయితే సమయం గడిచిన కొద్దీ వాతావరణం మారి పోయింది. అప్పటి వరకు కాస్త తేమగా ఉన్న పిచ్ ఒక్కసారిగా మారిపోయింది. అదే అదునుగా ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ లు రాణించారు.
మొదటి 3 ఓవర్లు మెయిడిన్ కాగా, తర్వాతి ఓవర్లో మంచి రిజల్డ్ వచ్చింది. సిరాజ్ వేసిన బంతిని ఆడలేక ఉస్మాన్ ఖ్వాజా కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. తొలి గంటలో 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 29 పరుగులే చేసింది. తర్వాత క్రీజులో ఉన్న డేవిడ్ వార్నర్, లబుషేన్ లు నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఉమేశ్ వేసిన ఓవర్లో వార్నర్ వరుస ఫోర్లు బాది అదే జోరును కొనసాగించాడు.
తర్వాత పటిష్ట స్థితికి చేరుకున్న ఆసీస్ ను శార్ధూల్ షాక్ ఇచ్చాడు. లంచ్ సమయానికి కాస్త ముందు లెగ్ సైడ్ వెళ్లిన బాల్ వార్నర్ వెంటాడగా..దానిని కీపర్ భరత్ అద్భుతంగా పట్టుకున్నాడు. వార్నర్, లబుషేన్ లు రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. విరామం తర్వాత షమీ బౌలింగ్ లో లబుషేన్ బౌల్డ్ అవ్వడంతో భారత్ కు కీలక వికెట్లు దక్కాయి.
అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు హెడ్, స్మిత్ కలిసి సమిష్టగా ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఎదుర్కొన్న 16 బంతుల్లోనే 6 ఫోర్లతో దూకుడుగా ఆడిన హెడ్ 60 బాల్స్ లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రెండో సెషన్ లో భారత్ కు వికెట్ దక్కలేదు. చివరి సెషన్ లోనై అదే జోరు కొనసాగింది. 144 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ చేయగా.. ఆ తర్వాత కొద్ది సేపటికే హెడ్ 106 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది హెడ్ కెరీర్ లో 6 వ శతకం కాగా.. టెస్టు ఛాంపియన్ షిప్ లో తొలి సెంచరీ.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (c) భరత్ (b) శార్దుల్ 43; ఖ్వాజా (c) భరత్ (b) సిరాజ్ 0; లబుషేన్ (b) షమీ 26; స్మిత్ (బ్యాటింగ్) 95; హెడ్ (బ్యాటింగ్) 146; ఎక్స్ ట్రా లు 17; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76.
బౌలింగ్: షమీ 20–3–77–1, సిరాజ్ 19–4– 67–1, ఉమేశ్ 14–4–54–0, శార్దుల్ 18–2– 75–1, జడేజా 14–0–48–0
డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజు భారత్ కు ఎదురుగాలి వీచింది. ఆరంభం బాగున్నా.. ఈ తర్వాత మ్యాచ్ పై పట్టు విడిచింది. ఓవల్ లో మధ్యాహ్నం తర్వాత ఎండ బాగా రావడంతో పిచ్ లో మార్పు వచ్చింది. దీంతో పరిస్థితులు బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోయాయి. ఆరంభంలో ఉన్న సీమ్ కదలికలు కనిపించకపోవడంతో బంతి అనుకున్నంత స్వింగ్ అవ్వలేదు. అయితే రెండో రోజు ఉదయం మళ్లీ పరిస్థితులు మారి బ్యాటింగ్ కు అనుకూలించకపోతే భారత్ దానిని సద్వినియోగం చేసుకోవాలి.
ఎంత వీలైతే అంత త్వరగా వికెట్లు పడగొట్టాలి. ఒకవేళ ఆసీస్ స్కోర్ 450 దాటితే మాత్రం భారత్ కు విజయం కష్టంగా మారుతుంది. భారత్ బ్యాటింగ్ సమయానికి పిచ్ ఎలా మారుతుందో చెప్పలేము. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తే మాత్రం ఆసీస్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, బోలాండ్ ను ఆపడం కష్టం. ఇదే జరిగితే భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. మంచి ఆరంభం లభించపోతే మ్యాచ్ ను ఆసీస్ తక్కువ రోజుల్లోనే చేజెక్కించుకోనే అవకాశం ఉంది.