Virat Kohli reacts on Bengaluru stadium Incident: 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంది. తొలిసారి టైటిల్ గెలవడంతో కర్ణాటక క్రికెట్ సంఘం ఆటగాళ్లను సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి.
క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. అధికారులు ఊహించని విధంగా అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. తాజాగా, ఈ ప్రమాదంపై ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించారు.
‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది. మాట్లేడేందుకు మాటలు కూడా రావడం లేదు. మీడియా ద్వారా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి గురయ్యాం. ఆర్సీబీ ఫ్యాన్స్ క్షేమంగా ఉండాలి. అందరి భద్రత, శ్రేయస్సు అత్యంత ముఖ్యమైంది. మద్దతు తెలిపే వారికి ఒక్కటే కోరుకుంటున్నా. అందరూ సేఫ్‌గా ఉండాలి.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.
బెంగళూరు ఘటనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట బాధాకరమన్నారు. ఈ దుర్ఘటన మాటలకు అందని విషాదమని చెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అనంతరం దేవుడు అందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.
అలాగే ఈ ఘటనపై నటుడు కమల్ హాసన్‌తో పాటు నటి, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయ విచారకరమన్నారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరారు. ‘హృదయం ముక్కలైంది’ అంటూ ఆర్సీబీ చేసిన ప్రకటనను అనుష్క శర్మ షేర్ చేసింది.