Gujarat vs Up: ఉమెన్ ప్రీమియర్ లీగ్.. ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే పలు భారీ స్కోర్లు నమోదు కాగా.. తాజాగా యూపీ- గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఓడిపోతారని అనుకున్న మ్యాచ్ లో గెలిచి.. గుజరాత్ కు యూపీ భారీ షాక్ ఇచ్చింది. మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
మహిళల ప్రిమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓడిపోయే స్థితి నుంచి పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ ను మట్టికరిపించింది. యూపీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించగా.. గుజరాత్ తన రెండో ఓటమిని నమోదు చేసుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. హార్లిన్ డియోడ్ 32 బంతుల్లో 46 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన 15 బంతుల్లో 24 పరుగులతో రాణించడంతో మెుదట 6 వికెట్ల నష్టానికి గుజరాత్ 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూపీ ఆరంభంలో తడబడింది. కానీ చివర్లో గ్రేస్ హారిస్ 26 బంతుల్లో 59 పరుగులు చేయడంతో.. మరో బంతి మిగిలి ఉండగానే యూపీ విజయాన్ని అందుకుంది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ రాణించింది. 36 పరుగులు ఇచ్చిన కిమ్.. 5 వికెట్లు పడగొట్టింది.
అలవోకగా గెలిచేలా కనిపించిన గుజరాత్ జెయింట్స్‌కు గ్రేస్ హారిస్ గట్టి షాక్ ఇచ్చింది. 26 బంతుల్లో 59 పరుగులతో గుజరాత్ కు ఓటమిని దూరం చేసింది. దీంతో వరుసగా రెండో ఓటమిని జెయింట్స్ మూట గట్టుకుంది. ఓ దశలో 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన యూపీ ఇక ఓటమి ఖాయమే అనుకున్నారు. కానీ చివర్లో గ్రేస్ బాదుడుతో సమీకరణం మారిపోయింది. కిరన్ నవ్‌గిరే రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో యూపీ ఓటమి బాటలో పయనించింది. ఆఖరి నాలుగు ఓవర్లలో యూపీ 63 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఎవరూ యూపీ విజయాన్ని ఊహించి ఉండరు. కానీ గ్రేస్ హారిస్ పెను విధ్వంసంతో గుజరాత్‌కు షాకిచ్చింది. వారియర్స్‌కు సంచలన విజయాన్నందించింది. మరోవైపు సోఫీ ఎకిల్‌స్టోన్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో తన వంతు పాత్ర పోషించింది. 17వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంతో మొదలైంది గ్రేస్ జోరు. చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సివుండగా.. గార్త్ ఓవర్లో ఆమె వరుసగా మూడు ఫోర్లు దంచింది. సోఫీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో యూపీకి 19 పరుగులు అవసరంకాగా.. అనాబెల్ సదర్లాండ్ పేలవంగా బౌలింగ్ చేసింది. తొలి బంతికే గ్రేస్ సిక్స్ కొట్టింది. ఆ తర్వాతి బంతుల్లో వరుసగా 4, 6 దంచడంతో యూపీ సంబరాల్లో మునిగిపోయింది.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో హర్లీన్ డియోల్ రాణించింది. ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన ధాటిగా ఆడింది. ఫాస్ట్‌బౌలర్ అంజలి శ్రావణి బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు దంచిన ఆమె.. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టేసింది. 3 ఓవర్లలో జట్టు స్కోరు 30. అయితే ఇన్నింగ్స్ జోరుగా సాగుతుండగా ఔటైంది.