Site icon Prime9

India Beats Zimbabwe: మూడో వన్డేలోనూ టీమిండియా విజయం

India Beats Zimbabwe: హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.

మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ధావన్, రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ధావన్ 40 పరుగులు చేయగా, రాహుల్ 30 పరుగులు సాధించాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 63 పరుగుల జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు వెనుదిరిగారు. ఇక ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ తో కలిసి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు.

టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో 50 పరుగులు చేసిన ఇషాన్ రన్ ఔట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇషాన్ వెనుదిరిగిన గిల్ మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 82 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్ మెన్స్ నుంచి గిల్ కు సహకారం అందలేదు. దీపక్ హుడా ఒక్క పరుగు మాత్రమే చేయగా, సంజూ శాంసన్ 15 పరుగులు, అక్షర్ ఒక్క పరుగు, శార్థుల్ 9 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. ఒంటరి పోరాటం చేసిన గిల్ 97 బంతులు ఎదుర్కొని 130 పరుగులు చేసి చివరి ఓవర్ లో వెనుదిరిగాడు. ఎవాన్స్‌ 5 వికెట్లు తీయగా న్యాచి, జాంగ్వి తలో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన జింబాంబ్వేకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు కైటానో, కయాను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు భారత బౌలర్లు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సీన్ విలియమ్స్ ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశాడు. విలియమ్స్ కు సికందర్ రజా తోడు అవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రజా ఊపు చూస్తుంటే జింబాబ్వే విజయం ఖాయంలా కన్పించింది.45పరుగులు చేసిన సీని విలియమ్స్ అక్షర్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. విలియమ్స్ పెవిలియన్ చేరినా రజా మాత్రం తన వేగం తగ్గించలేదు. వరుస పెట్టి బౌండరీలు కొడుతు జింబాబ్వేని విజయానికి చేరువ చేశాడు. ఈ క్రమంలోనే 88 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. అయితే జింబాబ్వే విజయానికి 9బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో శార్ధుల్ బౌలింగ్ లో గిల్ అద్భుత క్యాచ్ కు 115 పరుగుల వద్ద రజా పెవిలియన్ చేరాడు. సికందర్ రజా ఔట్ కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా చాహర్, హుడా, అక్షర్ తలో రెండు వికెట్లు తీశారు. సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

Exit mobile version