Ind Vs Aus 3rd Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 109 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. బంతి స్పిన్‌కు అనుకూలించడంతో.. రోహిత్ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కుప్పకూలిన టీమిండియా బ్యాటింగ్.. (Ind Vs Aus 3rd Test)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ స్పిన్ ధాటికి చేతులెత్తయడంతో.. 109 పరగులకే భారత్ మెుదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటర్లలో కోహ్లి మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మెుదటి ఇన్నింగ్స్ లో కోహ్లి 22 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్కోరు శుబ్‌మన్ గిల్ 21. దీనిని బట్టి పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఉమేశ్ యాదవ్ 17 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ 100 పరుగుల మార్కును దాటింది.
విజృంభించిన ఆసీస్ బౌలర్లు..
మూడో టెస్టులో ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయారు. మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు. మెుత్తం వికెట్లను స్పిన్నర్లు పడగొట్టారు. ఇక కీలక బ్యాటర్లను ఆ జట్టు స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ వెనక్కి పంపాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ లను అవుట్ చేశాడు. టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లిని ఎల్బీడబ్ల్యూ చేయగా.. మహ్మద్ సిరాజ్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
15 ఏళ్లలో ఇది నాలుగోసారి..
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం మినహా ఏది టీమిండియాకు ఏది కలిసిరాలేదు. ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు క్రికెట్‌లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం గత 15 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 76 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 2017 పుణేలో ఆస్ట్రేలియాతో టెస్టులో 105 పరుగులకు కుప్పకూలింది. మళ్లీ అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ అయింది. తాజాగా ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 109 పరుగులకు కుప్పకూలింది.