Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు. కానీ వన్డేల విషయానికి వచ్చేసరికి ఆటలో తేలిపోతున్నాడు. దీంతో సూర్యపై విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఓ దశలో సూర్య కుమార్ ని తప్పించాలని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
వన్డేల్లో సూర్య కుమార్ యాదవ్ ఆటకి.. టీ20 ల్లో ఆటకి చాలా తేడా ఉంది. టీ20ల్లో అడుతున్న సూర్య, ఈ సూర్య ఒక్కరేనా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అరవీర భయంకరంగా కనిపించే సూర్య వన్డేల్లో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్ లో మెరుపుల సంగతి పక్కన పెడితే.. కనీసం పరుగులు రావడం కూడా కష్టంగా ఉంది. దీంతో సూర్యకి ఏమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్ల బౌలింగ్‌లో అవుటైన బ్యాటర్‌ను మరీ అంతగా విమర్శించడం సరికాదు అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ది వేరే లెవల్ అంటూ ఆకాశానికెత్తాడు.
సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్. టీ20ల్లో అతని వేగం అద్భుతం. అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్ స్థానానికి వెళ్లిపోయాడు.
బౌలర్ ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా మైదానంలో విరుచుకుపడుతుంటాడు.
ఈ క్రమంలో అన్నివైపులా షాట్లు కొట్టి 360 డిగ్రీల బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు కూడా.
ఇప్పటివరకు టీ20ల్లో సూర్య 48 మ్యాచ్‌ల్లో 1675 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేటు ఏకంగా 176.
టీ20ల్లో సూర్య బ్యాటింగ్ చూసి వావ్ అనుకున్న ఫ్యాన్స్, క్రీడా పండితులు అర్జెంట్‌గా వన్డేల్లోకి, టెస్టుల్లోకి తీసుకొచ్చేయండి అన్నారు. అనుకున్నట్లుగా సూర్య వన్డేల్లోకి వచ్చాడు.
అయితే టీ20 జోరు మాత్రం తీసుకురాలేకపోయాడు. ఆఖరికి ఆ ఫామ్‌ను కూడా కొనసాగించలేకపోయాడు. ఇప్పటివరకు 22 వన్డేలు ఆడిన సూర్య 433 పరుగులు మాత్రమే చేశాడు.
అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. టీ20లతో పోలిస్తే ఈ స్కోరు ఏ మూలకూ సరిపోదు.
ఆఖరి పది ఇన్నింగ్స్‌లు చూసుకుంటే 0, 0, 14, 31, 4, 6, 34, 4, 8, 9 పరుగులు చేశాడు. ఆఖరిగా అర్ధశతకం కొట్టి… సంవత్సరం దాటిపోయింది.
సూర్య లాంటి స్టార్ ఆటగాడిని పక్కన పెట్టాలని ఏ టీమ్ మేనేజ్ మెంట్ కోరుకోదు. అయితే ఇలా ఎన్ని అవకాశాలు ఇస్తారన్నది వేచి చూడాలి.
ఎందుకంటే జట్టులో ఇప్పుడు ప్రతి స్థానం కోసం పోటీ గట్టగా ఉంది. ఈ సమయంలో ఇంకెన్ని మ్యాచ్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యను బ్యాకప్ చేస్తుంది అనేది చూడాలి.