Site icon Prime9

Neeraj Chopra : మరోసారి సత్తా చాటిన నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్ లో స్వర్ణం కైవసం

Neeraj Chopra won gold in Switzerland diamond league

Neeraj Chopra won gold in Switzerland diamond league

Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన  నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి తన టాలెంట్ చూపించాడు. స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్‌లో టైటిల్ సాధించి సత్తా చాటాడు. ఫస్ట్‌ త్రోలో జర్మనీకి చెందిన వెబర్‌ 86.20 మీటర్లు విసిరాడు కానీ.. చోప్రా మాత్రం తన మొదటి ప్రయత్నాన్ని ఫౌల్ రూపంలో చేజార్చుకున్నాడు. రెండో, మూడో ప్రయత్నంలో 83.52m, 85.04m విరిశాడు. తర్వాత నాల్గో ప్రయత్నం కూడా విఫలమైంది. మిగిలిన ఆఖరి అవకాశాన్ని చోప్రా సద్వినియోగం చేసుకున్నాడు. ఆఖరి ప్రయత్నంలో ఊహించని విధంగా 87.66మీటర్లు త్రో చేశాడు. తన ఆఖరి ప్రయత్నంలో జర్మనీ ఆటగాడు వెబర్‌ 87.03 మీటర్‌లు మాత్రమే త్రో చేయగలిగాడు. దీంతో నీరజ్‌ చోప్రా విజయం ఖాయమైపోయింది.

సుమారు నెల రోజుల విరామం తర్వాత.. గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. నీరజ్‌కి ఇది ఎనిమిదో అంతర్జాతీయ బంగారు పతకం. అంతకుముందు ఆసియా క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు, డైమండ్ లీగ్ వంటి టోర్నీల్లో బంగారు పతకాలు సాధించాడు. నీరజ్‌కి ఈ ఏడాదిలో ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. అంతకుముందు మేలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఈ ఈవెంట్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్.. 87.03 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చే.. 86.13 మీటర్లు విసిరి.. మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఈ సందర్భంగా నీరజ్‌ చోప్రా మాట్లాడుతూ.. డైమండ్‌ లీగ్‌లో స్వర్ణం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఇవ్వాల్సిన బెస్ట్ కంటే చాలా వెనుకబడి ఉన్నానని అన్నారు.  ఇంకా మెరుగు పరుచుకోవాల్సింది చాలా ఉందన్నాడు. ఈ విజయం ఆనందంగా ఉన్నప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని చెప్పాడు. ఇంకా శిక్షణ తీసుకోవాల్సిందేనని.. దానికి కొంత టైం కేటాయించాలని తెలిపారు. అప్పుడే తాను మరింత మెరుగుపడతానని అన్నాడు.

Exit mobile version