Fifa World Cup: ఫిఫా ప్రపంచ కప్ 2022 సంచలనాలకు నాందిగా నిలుస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో చిన్న జట్టులు అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్నారు. వీటిలో ముఖ్యంగా మొరాకో జట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రూప్ దశ లోనే గత టోర్నీ రన్నరప్ అయిన క్రొయేషియా జట్టును ఓడించి ఒక్కసారిగా అందర్నీ షాక్ కి గురి చేశారు. ఆ తర్వాత బలమైన బెల్జియం టీం పై కూడా మంచి విజయం సాధించి అందరి చూపు తమ వైపుకి తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ జట్టు మరో సంచలనం సృష్టించింది.
మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మాజీ చాంపియన్ స్పెయిన్ ను ఓడించి ప్రపంచ కప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకొని చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఈ ప్రి క్వార్టర్ ఫైనల్లో మొరాకో పెనాల్టీ షుటౌట్లో 3–0 తేడాతో స్పెయిన్ ను ఓడించడం గమనార్హం. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఆ తర్వాత అదనపు సమయం (30 నిమిషాలు) లోనూ ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయకుండా 0–0తో నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు.
ఇందులో మొరాకో తరఫున అబ్దెల్లామిడ్ సబిరి, హకీమ్ జయెచ్, అక్రాఫ్ హకిమి గోల్స్ సాధించారు. స్పెయిన్ మూడు ప్రయత్నాల్లోనూ ఫెయిలవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా ఈ షూటౌట్ లో మొరాకో గోల్ కీపర్ తన అద్బుత ప్రదర్శనతో టీంకి విజయాన్ని అందించాడు. సోలెర్, బాస్కెట్స్ కొట్టిన షాట్లను గోల్ కీపర్ యాసిన్ మంచిగా అడ్డుకున్నాడు. ఇక మొదటి సారి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ లో మొరాకో టీం ప్రవేశించడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.