Site icon Prime9

RR vs PBKS : పంజాబ్ పై సూపర్ విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్..!

RR vs PBKS match highlights in ipl 2023

RR vs PBKS match highlights in ipl 2023

RR vs PBKS : ఐపీఎల్ 2023 లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌ తో రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సీజన్‌లో 14వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఏడో విజయం కాగా.. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. అలానే మరోవైపు 14వ మ్యాచ్ ఆడిన పంజాబ్‌కి ఇది 8వ ఓటమి కాగా.. ఈ ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే మిగిలిన జ‌ట్ల ఫ‌లితాలను బ‌ట్టి రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తేలనుంది. ఇక  ఆర్సీబీ, ముంబైలు తాము తర్వాత ఆడబోయే లీగ్ మ్యాచ్ లలో ఓడితే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా  రాజస్తాన్  ప్లేఆఫ్స్ కు వెళ్లే వీలుంది.

188 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ కి స్టార్టింగ్ లోనే గట్టిదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ (0) డకౌటయ్యాడు. కానీ.. సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (50: 36 బంతుల్లో 8×4), పడిక్కల్ (51: 30 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (2) నిరాశ పరిచినా.. హెట్‌మెయర్ (46: 27 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడి రాజస్థాన్‌ని గెలుపు తీరాలకి చేర్చి 179 పరుగుల వద్ద ఔటైపోయాడు. రాజస్థాన్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అవగా.. రాహుల్ చాహర్ బౌలింగ్ లో సిక్స్ బాదిన ధ్రువ్ జురెల్ (10 నాటౌట్: 4 బంతుల్లో 1×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు తీయ‌గా, సామ్‌క‌ర‌న్‌, అర్ష్‌దీప్ సింగ్‌, నాథ‌న్ ఎల్లిస్‌, రాహుల్ చాహ‌ర్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో సామ్ క‌ర‌న్‌ (49 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిగిలిన వారిలో జితేశ్ శ‌ర్మ‌ (44; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), షారుక్ ఖాన్‌(41 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడి టీం కి సపోర్ట్ ఇవ్వడంతో మంచి స్కోర్ చేయగలిగింది. మిగిలిన బ్యాట్స్ మెన్ లలో లివింగ్ స్టోన్‌(9), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2)లు విఫ‌లం కాగా.. ధావ‌న్‌(17), అథర్వ తైదే(19) కాస్త ప‌ర్వాలేద‌నిపించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో న‌వ‌దీప్ సైనీ మూడు వికెట్లు తీయ‌గా, బౌల్ట్‌, జంపా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

Exit mobile version