Site icon Prime9

MI Vs PBKS : ఊహించని రీతిలో ముంబైని మట్టికరిపించిన పంజాబ్.. విధ్వంసం సృష్టించిన శామ్ కరన్, భాటియా

MI Vs PBKS match highlights in ipl 2023

MI Vs PBKS match highlights in ipl 2023

MI Vs PBKS : ఐపీఎల్ 2023 లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్‌ పై పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 201 ప‌రుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 13 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) నిరాశపరిచినా.. కెప్టెన్ రోహిత్ శర్మ (44: 27 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడేశాడు. ఇక కామెరూన్ గ్రీన్‌ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్‌ (57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీతో దుమ్మురేప‌గా, ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్‌ (25 నాటౌట్; 13 బంతుల్లో 2సిక్స‌ర్లు) లు జ‌ట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఆఖరి ఓవర్‌లో ముంబయి విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం అవగా.. డేవిడ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కే పరిమితమవడం ముంబైని దెబ్బతీసింది. లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ వరుసగా తిలక్ వర్మ (3), నేహాల్ వధీర (0)‌ని క్లీన్‌ బౌల్డ్ చేసి.. కేవలం 2 పరుగులే ఇచ్చాడు. అర్షదీప్ విసిరిన వేగానికి తిలక్, వధీర బౌల్డ్ అయినప్పుడు మిడిల్ స్టంప్ రెండు సార్లూ విరిగిపోవడం గమనార్హం. మొత్తానికి పంజాబ్.. ముంబైని మట్టకరిపించి ఊహించని విజయం సాధించింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీయ‌గా నాథ‌న్ ఎల్లిస్‌, లియామ్ లివింగ్‌ స్టోన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు ఆరంభం లోనే  18 ప‌రుగుల‌కే మాథ్యూ షాట్ (11) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. యువ ఆట‌గాళ్లు ప్రభ్‌ సిమ్రాన్ సింగ్ (26; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు), అథర్వ తైడే(29; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడ‌డంతో ప‌వ‌ర్ ప్లే పూర్తి అయ్యే స‌రికి పంజాబ్ 58 పరుగులు చేయగలిగింది. ఒకానొక దశలో ముంబై బౌల‌ర్లు విజృంభడంతో పంజాబ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌ సిమ్రాన్ సింగ్‌ను అర్జున్ టెండూల్క‌ర్ ఔట్ చేయ‌గా.. లివింగ్ స్టోన్, అథర్వ తైడే ల‌ను పీయూష్ చావ్లా ఒకే ఓవ‌ర్‌లో ఔట్ చేసి పంజాబ్‌ను గట్టిగానే దెబ్బ‌కొట్టాడు. దీంతో 10 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 83/4 గా ఉంది. ఈ ద‌శ‌లో ఇన్నింగ్స్ నిల‌బెట్టే బాధ్య‌త‌ను కెప్టెన్ సామ్ క‌ర‌న్‌తో పాటు హర్‌ ప్రీత్ సింగ్ భాటియా తీసుకున్నారు. కెప్టెన్ శామ్ కరన్ (55: 29 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకం బాదగా.. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (41: 28 బంతుల్లో 4×4, 2×6), జితేశ్ శర్మ (25: 7 బంతుల్లో 4×6) భారీ షాట్లు ఆడేశారు.

ముఖ్యంగా అర్జున్ టెండూల్క‌ర్ వేసిన 16వ ఓవ‌ర్‌ లో సామ్ క‌ర‌న్ ఓ సిక్స్, ఫోర్ కొట్టగా, హర్‌ ప్రీత్ సింగ్ భాటియా సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు.. అలాగే ఓ నోబాల్ కూడా వేయ‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 31 ప‌రుగులు వ‌చ్చాయి. ఆ తర్వాత జోఫ్రా ఆర్చ‌ర్ వేసిన 17వ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు, కామెరూన్ గ్రీన్ వేసిన 18 ఓవ‌ర్‌లో 25 ప‌రుగులు వ‌చ్చాయి. ఇక చివర్లో భాటియా, క‌ర‌న్ ఔటైన‌ప్ప‌టికీ ఆఖ‌ర్లో జితేశ్ శ‌ర్మ విధ్వంసం సృష్టించ‌డంతో పంజాబ్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ఆఖ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు ఏకంగా 96 పరుగులు సాధించడం గమనార్హం.  ముంబయి ఇండియన్స్ బౌలర్లలో చావ్లా, గ్రీన్ చెరో రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్, బెరండ్రాఫ్, ఆర్చర్‌కి తలో వికెట్ దక్కింది.

 

Exit mobile version