CSK Beats GT with 86 Runs: ఐపీఎల్ సీజన్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ ను భారీ విజయంతో ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్ రౌండ్ షో చూపించి గుజరాత్ టైటాన్స్ పై 86 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ను సొంతగడ్డపై మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగులతో గుజరాత్ ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపారు. ఇక బౌలింగ్ లోనూ చెన్నై ఆటగాళ్లు రాణించారు. 231 పరుగులతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టును 147 పరుగులకే కుప్పకూల్చారు.
కాగా చెన్నై నిర్దేశించిన 231 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. పవర్ ప్లే ముగిసే వరకు ఆ జట్టు 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాంబోజ ఖలీల్ అహ్మద్ 12 బంతుల్లోనే గిల్, బట్లర్, రూథర్ ఫోర్డ్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్, షారుక్ నాలుగో వికెట్ కు 55 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ కు ఆశలు కల్పించారు. కానీ 11 ఓవర్లో షారుక్ వెనుదిరగడంతో గుజరాత్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. పరుగుల రాబట్టడం కంటే గుజరాత్ వరుస వికెట్లు కోల్పోయింది. చివరికి 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, కంబోజ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జడేజా రెండు, ఖలీల్, పతిరానా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారీ విజయంతో చెన్నై తన ఐపీఎల్ సిరీస్ ను ముగించింది.