Site icon Prime9

CSK vs RR : చెన్నై సూపర్ కింగ్స్ ని రెండోసారి చిత్తు చేసిన రాజస్థాన్.. ఛేజింగ్ లో చతికలుబడ్డ చెన్నై బ్యాటర్లు

CSK vs RR match highlights in ipl 2023

CSK vs RR match highlights in ipl 2023

CSK vs RR : ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా జరిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో చెన్నై చేతులెత్తేసింది. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే ప‌రిమిత‌మవ్వడంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక చెన్నై బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి స్టార్ట్ ఇచ్చినా.. మరో ఓపెనర్ దేవాన్ కాన్వె (8) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (15) తక్కువ స్కోరుకే ఔటైపోయినా.. గైక్వాడ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. టీమ్ స్కోరు 69 వద్ద గైక్వాడ్ ఔటైపోగా.. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె (52: 33 బంతుల్లో 2×4, 4×6) ఆ జోరుని కొనసాగించే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి అంబటి రాయుడు (0), మొయిన్ అలీ (23: 12 బంతుల్లో 2×4, 2×6) ఎక్కువ సేపు సపోర్ట్ ఇవ్వలేకపోయారు. కానీ చివరి వరకు రవీంద్ర జడేజా (23 నాటౌట్: 15 బంతుల్లో 3×4) సహాయంతో లాక్కొచ్చిన చివరి ఓవర్లలో స్కోర్ ని రాబట్టడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా మూడు వికెట్లు తీయ‌గా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంత‌కముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. జోస్ బ‌ట్ల‌ర్(27; 21 బంతుల్లో 4 ఫోర్లు) ప‌రుగులు చేసి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి బ‌ట్ల‌ర్ ఔట్ అయ్యాడు. దీంతో 86 ప‌రుగుల వీరి భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ తర్వాత సంజు శాంస‌న్‌(17; 17 బంతుల్లో 1ఫోర్‌), హెట్మెయర్(8) తక్కువ పరుగులకే వెనుదిరిగినా చివర్లో ధ్రువ్ జురెల్ (34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్‌; 13 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడ‌డంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీయ‌గా మ‌హేశ్ తీక్ష‌ణ‌, ర‌వీంద్ర జ‌డేజా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ సీజన్ లో రాజస్థాన్, చెన్నైని రెండో సారి ఓడించడం గమనార్హం. ఈ నెల 12న చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నైని 3 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడించేసిన విషయం తెలిసిందే. కాగా సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఐదో విజయం కాగా.. 10 పాయింట్లతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో ఉంది. చెన్నై కూడా 10 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్‌‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా 3 వ స్థానంలో నిలిచింది.

Exit mobile version