Site icon Prime9

Wimbledon 2023 Winner: అల్కరాస్ అద్బుతం.. వింబుల్డన్ 2023 టైటిల్ విన్నర్ గా స్పెయిన్ యువ సంచలనం

Wimbledon 2023 Final winner Carlos Alcaraz

Wimbledon 2023 Final winner Carlos Alcaraz

Wimbledon 2023 Winner: కార్లోస్‌ అల్కరాస్‌ ఇప్పుడు ఈపేరే ఎక్కువగా వినిపిస్తోంది. వింబుల్డన్‌ 2023లో ఈ యువ ఆటగాడు సంచలనం సృష్టించాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్‌ టైటిల్‌ను తన వశం చేసుకున్నాడు ఈ స్పెయిన్‌ కుర్రాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ అల్కరాస్‌ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్‌ జకోవిచ్‌పై ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠ పోరులో తొలి సెట్‌ లో ఓడిన అల్కారాస్ రెండో సెట్లో అద్భుతంగా పుంజుకుని గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

తొలి సెట్ ఓడిన అల్కారాస్ ఆ తర్వాత రెండు సెట్లలో విజయం సాధించాడు. ఇక ఇదే సమయంలో నొవాక్‌ జొకోవిచ్‌ కాస్త విరామం తీసుకుని కోర్టులో అడుగుపెట్టి తన అనుభవాన్ని ఉపయోగించి అల్కరాస్‌ జోరుకు కళ్లెం వేస్తూ నాలుగో సెట్‌ లో గెలుపొందాడు. దానితో ఇరువురి స్కోర్ 2-2తో సమమైంది. ఇక ఈ సందర్భంలో ఇద్దరు దూకుడును పెంచి ఆడడంతో మ్యాచ్ కాస్త రసవత్తరంగా మారింది. ప్రేక్షకులు కళ్లు తిప్పకుండా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠతతో వీక్షిస్తున్నారు.

జొకోను వెనక్కు నెట్టి మరీ(Wimbledon 2023 Winner)

ఈ సమయంలో తన ఎక్స్ పీరియన్స్ తో అల్కరాస్ ను కట్టడి చేస్తూ వచ్చిన జొకో ఒకనొక సమయంలో సర్వీస్ లను నిలబెట్టుకోలేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దానితో స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్‌ తన సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ సాధించాడు.

ఈ విజయంతో అల్కరాస్ తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాడు. 2022లో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన కార్లోస్‌ అల్కరాస్‌ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమై వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న జొకోవిచ్‌.. వింబుల్డన్‌ ఆఖరి మ్యాచ్ లో బోల్తాపడ్డారు. ఇకపోతే వింబుల్డన్‌ విజేతగా నిలిచిన అల్కరాస్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్‌ జొకోవిచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.

Exit mobile version