Indian Women’s Cricket Team: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఈ రోజు ఉదయం షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి బంగారు పతకం వచ్చింది. దీనితో ఆసియాక్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 9 కు చేరింది.
73 పరుగుల భాగస్వామ్యం..(Indian Women’s Cricket Team)
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 116 పరుగులు చేసింది. భారత్ తరఫున స్మృతి మంధాన 46 పరుగులతో టాప్ స్కోర్ చేసింది.ఓపెనర్ షఫాలీ వర్మ అవుట్ అయిన తరువాత స్మృతి మంధాన మరియు జెమిమా రోడ్రిగ్స్ 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోడ్రిగ్స్ 40 బంతుల్లో 42 పరుగులు చేసింది. అయితే రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, రణవీర తలో రెండు వికెట్లు తీశారు.
టిటాస్ సాధు కొత్త బంతితో ఓపెనర్లు చమరి అతపత్తు మరియు అనుష్క సంజీవని ఇద్దరినీ అవుట్ చేయడంతో పాటు విష్మి గుణరత్నేను కూడా క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది.అయితే, హాసిని పెరీరా మరియు నీలాక్షి డి సిల్వా 36 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫెరీరా 22 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయిన తరువాత 34 బంతుల్లో 23 పరుగులు చేసి తర్వాత డిసిల్వా అవుట్ అయ్యారు.శ్రీలంక 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.